13. కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు


వేదాంత వాక్యముల రమియించుచుండు
భిక్షాన్నమాత్రమున సంతుష్ఠినుండు
శోకంబు లేకుండు కరుణతో నిండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు

ఏ చెట్టుమూలనో నివసించుచుండు
అరచేతిలో భిక్ష భుజియించుచుండు

ఏ చెట్టుమూలనో నివసించుచుండు
అరచేతిలో భిక్ష భుజియించుచుండు

బొంతనైనను స్త్రీవలె దూరముగ నుంచు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు

దేహాభిమానంబు వర్జించి ఉండు
ఆత్మయందాత్మను వీక్షించుచుండు
రేపవలు బ్రహ్మమున రమియించుచుండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు

ఆత్మసుఖమును పొంది సంతుష్ఠితోనుండు
ఇంద్రియముల ప్రవృత్తులణగారి ఉండు
అంతర్ బహిర్ విషయ స్మరణ లేకుండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు

పంచాక్షరంబులను జపియించుచుండు
హృదయమున పశుపతిని భావించుచుండు
భిక్షగొనుచు దిశలు తిరుగాడుచుండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు

కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు