తెలిసి మౌనము పూనవె చిలిపి మనస


తెలిసి .. ..
మౌనము పూనవె .. ..
చిలిపి మనస !

1. తెలివియను తెరయందున తీరకుండ
జగము మాయ బొమ్మల వోలె జరుగుచుండ
తెలివికిని వేరుగ నీవుకల్గుటెట్లు?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

2. క్షణము తీరిక దొరుక సుఖపడలేక
ఏదియోమరిచేయ ఊహింతువేల?
ఊరకున్న లోన సుఖము ఊరిరాదె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

3. ఇదియు అదియును చేసి ఎంతెంతొ చేసి
తుదకు సుఖియింతునన్నచో దుఃఖమిపుడు
ఎట్టిఆశలు లేకున్న ఇపుడె సుఖము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

4. పగటి కలలందు విహరింప ఫలితమేమి?
ఊహలోని సుఖము నిలుచుండగలదె
కల్పనలు లేనట్టి ఉనికియె ఘనసుఖంబు
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

5. సాక్షివీవని తెలుపంగ సరి అనెదవు
మరల కర్తను నేనను అభిమాన మేల?
అరయువానికేరీతి చేతలంటగలవు!
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

6. ఇది జరుగునొ కాదొ అనుచును మథనమేల?
జరుగవే అన్ని ప్రారబ్ధశక్తిచేత
జరుగకున్నను సాక్షికి తరుగు కలదె?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

7. ఎటుల చేయుటిది అటులొ ఇటులొ అనుచు
బహువిమర్శించి సంక్షోభ పడగనేల?
ఇచ్ఛ విడిన నిర్ణయమెట్టులైన నేమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

8. ఇటులనే కావలయునిది ఎటులైన
అనుట బాధయౌగాని అట్లౌనోకాదో
పట్టుదల వీడి చూచుటె బహుసుఖంబు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

9. తలచి నంతనె పనులు కావలయు ననెడి
ఆతురత పనుల చెరచు ఆయాసమిచ్చు
ఐన ఔనుకాకున్న పొమ్మనుటె సుఖము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

10. ఏదో రాకుండె రాదేమి ఎపుడు వచ్చు
ఏమి అగును ఎటౌనంచు ఎదురు చూడ
తపనయౌగాని లాభమే మింతైన కలదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

11. ఆలు బిడ్డలు బంధు మిత్రాదులందు
బాధ్యతల తల పోయుచు భ్రమయు నేల?
కాదు నీదేదియును నాటకంబు జగము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

12. జ్ఞానియైనను ధర్మంబు సలుపవలయు
అనెడు కర్తవ్య బుద్ధి చే కనల నేల?
కల్లబొల్లి జగమందు కార్యమేమి ?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

13. లోకశాస్త్ర మర్యాదల లోన చిక్కి
తప్పుఒప్పుల చింతించు త్రిప్పటేల
ఏదియెటులున్న మిథ్యయే ఎంచి చూడ
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

14. ఈ పని సరిగ చేయక లోపమయ్యె
నలుగురేమందురో అంచు కలగనేల
పనుల కంటని ఆత్మకు భంగమేమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

15. పాపమని లోపమని తలపంగనేల?
తప్పుచేసిన భావన తగులనేల?
కర్మలేని సాక్షికి తప్పు కలుగుటెట్లు?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

16. ఏది ఎవరెట్లు ఎచ్చట ఎప్పుడనుచు
జగతి వార్తల యందేల సంబరంబు
మిథ్యయందున కుతూహల మేల నీకు !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

17. ఏదొ అగుపించ వినిపింప ఏదనుచు
బుద్ధినిలిపి తెలియు శ్రమ అదేల ?
ఉన్నదది ఏదొ ఉండదె ఊరకున్న ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

18. నాకు కర్తవ్యమసలేమి నాస్తికాని
పరులకై చేయవలెనంచు పాటులేల
కలను మేలుకొన్న పరులు కలుగుటెట్లు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

19. దైవకార్యము దైవాజ్ఞ ధర్మమనుచు
సంఘసేవ అనుచును జంజాటమేల
మాయ జగము నందొక పని మంచి ఏమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

20. పాపమెచ్చెను ధర్మంబు భ్రష్టుపట్టె
జగము మారుటెట్లనుచు విచారమేల
మాయ ఇది అని చూచుటె మార్చుటగును ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

21. తత్త్వమెరిగితి నేనంచు తలపు చెలగి
పదుగురికి చెప్పవలెనంచు పాటులేల
పరులు వేరుగ కలరన్న భ్రాంతి కాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

22. వ్యాధి బలహీన మాకలి బాధలనుచు
తనువుపై నీకు సతతమ్ము ధ్యానమేల
దేహమేమైన మరి ఆత్మ స్థిరము కాదె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

23. సొగసు సింగార మతి పరిశుభ్రతనుచు
దేహసేవ చేయు గతి అదేమి నీకు |
నీకొరకు అది దానికై నీవుకాదు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

24. అయ్యొ కష్టంబు నాకర్మ మయ్యె ఇటుల
కటకటా ఓర్చుటెటులంచు కంపమేల?
జగమసత్తైన కష్టంబు సత్యమౌనె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

25. కష్టమొచ్చెను దీనికి కారణంబు
వీరు వారు అది అని వెదుకనేల
కష్టమనుభావనే మూలకారణంబు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

26. అది ఇటుల నాయె అటుల కాదాయె నంచు
గతము త్రవ్వుచు చింతింప వెతలుకాదె?
తలపు లందెకాక గతము కలదె ఇపుడు
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

27. కష్టమొచ్చిన దుఃఖంబు కలుగుగాక
వచ్చునేమొ అంచు ఇప్పుడేడ్వ పని ఏమి?
అసలు కంటెను ఊహించుటధిక బాధ ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

28. పరుల వెతలకు చలియించి బాధపడిన
అట్టి బాధ లెన్నటికైన అంతమగునె?
అఖిలమును నాటకం బట్లు అరయరాదె?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

29. విషయ సుఖమందు దుఃఖంబు వెంటవుండు
ఎరిగి ఎరిగియు బయలందు తిరుగ నేల
లోన మారని సుఖమును కానలేవె?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

30. ఇపుడె వేదాంత గగనాన ఎగిరి ఎగిరి
మరల విషయ భూముల యందు పొరలనేల?
ఏదిసుఖమంచు ఇంకను ఎరుగలేవె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

31. తాపరహిత సుఖము నీదాపు నుండ
తనువు సంగముచే కామతాపమేల
స్త్రీ పురుష భేద మాత్మ దృష్టికిని కలదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

32. సంపదెచ్చిన దాన అశాంతి హెచ్చు
ధనము నార్జింప రక్షింప తహతహేల
కొంచెమందున సంతృప్తి గొప్ప ధనము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

33. జగము నీవు తలచినట్లు జరుగకున్న
కోపతాపము లొందుచు కుముల నేల
జగతి నడపువాడవుకావు సాక్షి వీవు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

34. సకల విధముల తన ఆజ్ఞ జరుగగాను
పరుల హింసించు విపరీత భావమేమి
సమత కలిగించనట్టి నీ జ్ఞానమేమి ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

35. అల్పవిషయాల చిర్రు బుర్రాడు చుండ
మాటిమాటికి గుండెల మంటకాదె
సహనమందున తరగని శాంతిలేదె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

36. పరుడొకండు నిన్నవమాన పరచెననుచు
తలచి తలచి తాపంబు పొందగనేల
అరయ నీ కంటె జగమున అన్యమెవరు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

37. జరిగిన అపకారంబులు మరువ కున్న
పగను తీర్చుతలపు నిన్నె రగుల చేయు
అన్యులెవ్వరంతయు పరమాత్మకాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

38. ద్వేషము భయము దుష్టులందేల నీకు
సృష్టి భాగముకాదె ఆ దౌష్ట్యమంత
సకలము నుపేక్ష చేయుటె సాధుగుణము
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

39. పరుల సంపద చూచి కంపరము చెంది
వలయు నాకవి అన్నచో కలత ఏను
ఎన్ని ఉన్న అవి ఎన్న సున్న కాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

40. ఒకరి గొప్పతనము చూచి ఓర్వలేక
అంతకు మించి యత్నింప చింతకాదె
ఎక్కువయు తక్కువయు ఏమి ఏకమందు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

41. పొద్దుపోవమేమి విసుగు పుట్టుటేమి
ఊరకుండక పని ఏదో పూనుటేమి
కాలమదియె గడచు నీవు గడపుటేమి ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

42. ఏదొ మరచితి గురుతు రాదేల అనుచు
అధికముగ తలపోయ ఆయాసమేను
అఖిల జగమును మరువంగ హాయిలేదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

43. గొప్పతనమేమి గుర్తింపుకోరుటేమి?
ఖ్యాతి గౌరవ సత్కార కాంక్షలేమి?
అహము పెంచు ఆధ్యాత్మ విద్య అది ఏమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

44. గొప్పనేనను భావన కూల్చివేయు
తక్కువనుభావనయు బహుతాపమిచ్చు
తక్కువెక్కువలేని తత్త్వంబు ఘనము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

45. భయమదేల పలాయనంబదియునేల
త్యాగమంచు అది ఇది వీడ తలచనేల
విడుచువాని విడిన అన్ని విడిచి నట్లె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

46. ఎట్టులైన మనసు బిగబట్టగాను
ప్రబల యత్నముచే మౌన భంగమవదె
సహజమగు దాని సాధింప శ్రమఅదేల ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

47. తలపులాపక తనరూపు తెలియ దనుచు
చెలగి యత్నింప అదియొక తలపు కాదె
అన్నితలపులాపెడి యుక్తి నరయ రాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

48. కలదు సుఖమిందు ఇది ఇట్లె నిలువ వలయు
అనెడి తలపు ఆ సుఖంబున కడ్టుపడదె
ఉన్నదున్నట్లు చూచుటె మిన్నసుఖము
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

49. నామ రూప లింగ వయో గుణ స్వభావ
వర్ణ కర్మాది దృష్టిచే వ్యథయె కలుగు
ఎట్టి భావన లేని చూపెంత సుఖమొ ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

50. చూచి గురుతు తెచ్చి చెడు మంచూహ చేసి
ఎటుల ప్రతిచర్య అను తలపేల నీకు
ఏ వికారము లేని చూపెంత సుఖమొ ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

51. పరుల దోషాలు పరికించు చురుకు చూపు
బ్రహ్మదృష్టిని పోగొట్టు బంధమిచ్చు
తనను తాకాంచు చూపు వాసనల చంపు
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

52. ఇందు సుఖమేమి ఇట లాభమేమి
అనెడి స్వార్థ దృష్టిని పూన విశ్రాంతి ఎట్లు?
ఆశ విడి చూడ అఖిలంబు హాయి కొలుపు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

53. వలసి నంతగ ఏదైన తలచ వచ్చు
మరిమరి వ్యర్థముగ దాని మననమేల
క్షణము పూనివదలు శక్తి ఘనము కాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

54. మౌనముగ ఉంటినని ఎంచి మోసపోకు
నీవు లోలోన భాషించు నైజమేమి
లోన చలనంబు లాగక మౌనమెట్లు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

55. పాటలల్లి పద్యములల్లి పాట్లుపడిన
తెలుప చాలని తత్త్వంబు తెల్లమగునె
భాషలుడగక మౌనంబు పట్టుపడునె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !

56. మాటి మాటికి మౌనము మౌనమంచు
పద్యములు చదివిన అది పట్టు పడునె
పలుకు లాపి తలపులాపి నిలువ రాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !