9. కర్మములవియే జరుగుతు వుంటే...


కర్మములవియే జరుగుతు వుంటే
కర్తను నేనను భ్రమయేల
మర్మము తెలియక కర్మబంధమున
మరలా మరలా పడిపోనేలా

కాళ్ళు చేతులు కదులుతూ వుంటే
కదిలితినే ననుకోనేలా?
కళ్ళు చెవులు కాంచుతు వుంటే
కాంచితినే ననుకోనేలా?

ప్రాణము బొందిని నిలబెడుతుంటే
బ్రతుకుదు నేననుకోనేలా?
తలపులు మనసున పుడుతూ వుంటే
తలచితినే ననుకోనేలా?

సంకల్పంబులు, వికల్పంబులు
సంశయ నిర్ణయ వికారముల్‌
అంతరంగమున ఉబుకుతుంటే
అవి నావే యనుకోనేలా?

అన్ని తలపులు వాటికి అవియే
అశేషంబుగ పుడుతూ వుంటే
చేయవలెయునను ఇచ్ఛ మాత్రము
నా ఆధీనమనుకోనేలా?

సకల చరాచర విశ్వంబంతా
స్వప్నము వంటిది అయివుంటే
నేనునేనను అహంకారము
నిక్కంబని అనుకోనేలా?

ప్రకృతి ఈశ్వర నియమము చేత
ప్రపంచంబును నడుపుతూ వుంటే
పనులు చేయుటకు స్వాతంత్ర్యమ్ము
తనకు కలదనుకోనేలా

శ్రీగురు కృపచే సాధన జరిగితే
చేసితినే ననుకోనేలా
పాటలు చిత్‌గగనంబున పుడితే
పాడితినే ననుకోనేలా?

కర్మములవియే జరుగుతు వుంటే
కర్తను నేనను భ్రమయేల?