8. కలవంటిది కల్ల జగమిది


కల వంటిది కల్ల జగమిది, కల వంటిది కల్ల జగమిది
తెలివి కనులు తెరిచి చూడ, క్షణమందే కరుగునది
                                            || కల వంటిది కల్ల జగమిది ||
ఉన్నదనే భావనచే ఉండునట్టిది
ఉనికేదని తరచిచూడ ఉత్తదైపోవునది
నిమిషమైన ఒకరీతి నిలకడే లేనిది
అసలు రూపమునకు వెనుక అంతు చిక్కనట్టిది
                                            || కల వంటిది కల్ల జగమిది ||
సంకల్పముకన్న వేరు సత్వమే లేనిది
తలపులాపినంతనే విలయమై పోవునది
                                            || కల వంటిది కల్ల జగమిది ||
జాగ్రతందు ఒకపగిది, స్వప్నమందు ఒక పగిది
మారుచుండు నట్టిది, మాయకాక ఏమిది ?
                                            || కల వంటిది కల్ల జగమిది ||
చిత్ర చిత్ర గతుల తోడ చింతపెట్టు నట్టిది
ఇంత కునుకు పట్టినంత ఇగిరి పోవునట్టిది
                                            || కల వంటిది కల్ల జగమిది ||
ఉన్నదంత ఒక్కటనుచు ఉపనిషత్తు అన్నది
నామ రూప దృష్టి పోవ నానాత్వము వట్టిది
                                   || కల వంటిది కల్ల జగమిది ||
కల వంటిది కల్ల జగమిది తెలివి కనులు తెరిచి చూడ
క్షణమందే కరుగునది కల వంటిది కల్ల జగమిది
                                                || కల వంటిది కల్ల జగమిది... !!