7. జయము జయము బ్రహ్మవిద్య

జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
జయ జయహే ఆశ్రితజన  జననమరణ సంహర్త్రి
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి

గృహము నీకు వేదాంతము, గీతలు క్రీడాస్థలము
పరిపరి శాస్త్రములు నీ పరిచారికులైన జనము
అఖిల విద్యలకును నీవు అంతిమ గమ్యము
భవరోగికి నీ సేవ ప్రాణమిచ్చు వైద్యము
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి

నారాయణుడాదిగా నాగురువుల వరకును
పెక్కు బ్రహ్మవిదులు నిన్ను చక్కగ పోషింపగా...
పలుజన్మల పుణ్యంబులు ఫలియించిన వత్తువూ
గురుకరుణను చేరువై పరమపదము నిత్తువూ
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి

సురలు, నరులు, ఋషులు నిన్ను విరివిగా సేవింతురు
నీ పాలను త్రావి తల్లి నిత్య తృప్తులౌదురు
నిఖిల సిద్ధ సాధకులును నీరాజనమేడెదరు
మంగళమని మంగళమని మంగళమని పాడెదరు
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
జయజయహే ఆశ్రిత జన  జననమరణ సంహర్త్రి
జయము జయము