5. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదికేవు...



ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదికేవు 
నీయందె ఉన్నదే మనసా 
వెదికేది నీయందె ఉన్నదే మనసా 
సుఖము నీయందె ఉన్నదే మనసా !!

|| ఎందెందో తిరిగేవు ||

విషయాలలో సుఖము వెదకులాడుచు నీవు 
వెర్రివై తిరిగేవు మనసా 
కారణము లేకయే గాఢనిదురలొ నీకు 
ఘనసుఖము కలుగదా మనసా !!

|| ఎందెందో తిరిగేవు ||

దేహమందున దూరి దేహమే నేననుచు 
దీనతను చెందేవు మనసా
కట్టెలతో కాల్చేటి కాయంబుతో పొత్తు 
కష్టాలనే  తెచ్చు మనసా !!

|| ఎందెందో తిరిగేవు ||

నేను నేనంటావు, నాది నాదంటావు 
నేనెవరో చూడవే మనసా
నిను నీవు తెలియక, నిఖిలమ్ము పొందిన
నిశ్చింత కలుగదే మనసా !!

|| ఎందెందో తిరిగేవు ||

ఏదో చేయాలనుచు ఏదో పొందాలనుచు 
ఎందుకే తాపంబు మనసా
నిఖిలమ్ము వర్జించి నిశ్చలత చెందుటే 
నిజమైన సుఖమౌను మనసా !!

|| ఎందెందో తిరిగేవు ||