3. ఏదేమైతే బెదురేమున్నది...


ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు - 2

దాసులకు గురుదాసులకు
బోధానంద విలాసులకు

ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు

నీరు క్రమ్మినను, నిప్పు చెలగినను,
నింగి నేల ఏకమైనను
మారునదంతయు స్వప్నతుల్యమని
సారమెరింగిన ధీరులకు
ఏదేమైతే బెదురేమున్నది?

జనములు ధనములు నష్టమైనను
జగమున బహు అవమానమైనను -2

ఘనమగు తెలివికి లోపము లేదని
కలవరమందని ప్రాజ్ఞులకు
ఏదేమైతే బెదురేమున్నది?

తినుటకు ఏమియును దొరుకకున్నను
తీవ్రరోగములు కలచుచున్నను - 2
తనువు దుఃఖములు తనకు తగులవని
తత్వమరయు సత్పురుషలకు

ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు

వాదభేదముల విధమును వీడి
సాధన పథమున సాగుచును - 2

వేదాంతర్థమును సదా హృదయమున
విమర్శించు విజ్ఞానులకు

ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు - 2