12. అసంగోహం అసంగోహం


అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః

కోటి జీవులు కోటి వస్తువులు
కోటి ఘటనలు కోటి భ్రమలు
కల యందున వలె కదలుచుండగ
కదల కుండగ కాంచు సాక్షి 
||అసంగోహం ||
కోటి ఊహలు కోటి చింతలు
కోటి ఇంద్రియ జ్ఞానములు
చిత్తమందున చెలగి అణగుచు
శూన్యమగుటను చూచు సాక్షి
||అసంగోహం ||
కోటి బాధలు కోటి సుఖములు
కోటి కోటి వికారములు
ఎన్ని వచ్చిన ఎన్ని పోయిన
ఏమి మారక ఎరుగు సాక్షి
||అసంగోహం ||
క్షణము క్షణము గడచి పోవుచు
గతమునందున కలియు చుండగ
కాలమొక సంకల్పమాత్రమై
తరలి పోవగ కాంచు సాక్షి
||అసంగోహం ||
సకల భావనల సాక్షిగ చూచుచు,
సాక్షి భావనకును సాక్షిగ యగుచు
సాక్షిని నేనను సన్నని అహమిక
సమసిన ఉండెడి సాక్ష్యతీతము

అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః